శ్రీదత్త వేంకటేశ్వర దేవస్థానము 

శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము, దత్త నగరం, మైసూరు 570025   

                                                                         

వేంకటేశః పరో దేవో దత్తాత్రేయః పరో గురుః। 

     ద్వయో రభిన్నయో శ్శక్త్యా జగతా మస్తు మంగళమ్।।   

 

భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి ఇలవేల్పు శ్రీమన్నారాయణుడి కలియుగ అవతారం శ్రీదత్త వేంకటేశ్వర స్వామి. తిరుమలలో శ్రీవేంకటాచల మహాక్షేత్రంలో నెలకొన్న స్వామి, దేశమంతటా, ప్రపంచమంతటా అనేకమంది భక్త జనులనుద్ధరించేందుకు, ఆదుకునేందుకు అనేక దేవాలయాలలో వెలిశారు. వాటిలో కొన్ని పురాణ ప్రసిద్ధాలుగా ఉన్నాయి. మరికొన్ని మహాత్ములు ప్రతిష్ఠ చేసిన కారణికమైన క్షేత్రాలుగా ఉన్నాయి. 

మైసూరు నగరంలో, చాముండీ పర్వతం చరియల సమీపంలోని, అవధూత దత్తపీఠంలో నెలకొన్న శ్రీదత్త వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఈ కోవకు చెందినదే. మహామహిమాన్వితులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారికి, కలిగిన అనేక నిదర్శనాలవల్ల ఆవిర్భవించిన మహా క్షేత్రమిది. దత్తపీఠానికి ఈశాన్య భాగంలో విరాజిల్లే, ఈ దివ్యక్షేత్రంలో శ్రీదత్త వేంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల ఆలయం నమూనాలో నిర్మాణమైనది మరియు శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపం భక్తులకు కన్నుల పండుగ చేస్తూ, తిరుమలకు నిరంతరంగా వెళ్ళలేని లోటును తీరుస్తున్నది.  

ఈ క్షేత్రంలో శ్రీదత్త వేంకటేశ్వర స్వామితో పాటుగా, పద్మావతీ దేవి, ధన్వంతరి, సిద్ధి వినాయకుడు, నవగ్రహాలు, భూవరాహస్వామి, సర్వదోషహర శివలింగ పరివేష్టితమైన స్ఫటిక శివలింగము, మరకత సుబ్రహ్మణ్య స్వామి, నాగమండలము, కార్యసిద్ధి ఆంజనేయుడు, నామకోటి మండపంలో శ్రీసరస్వతీ దేవి, వేంచేసి, భక్తజనానీకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు.  

స్వామివారి కల్యాణసేవను చేసుకున్నవారి కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు తీరుతున్నాయి. అభిషేకసేవ చేసినవారికి ఆరోగ్యం సిద్ధిస్తోంది. ప్రతి వైశాఖ జ్యేష్ఠమాసాలలో జరిగే  బ్రహ్మోత్సవ సమయంలోనూ, శ్రావణ శనివారాలలోనూ, యుగాదినాడు, ముక్కోటి ఏకాదశినాడు,  శ్రీవారి దర్శనం చేయడం, సముద్ర తీరంలో లభించి ఈ క్షేత్ర ఆవిర్భావానికే కారణమైన మూలమూర్తిని సేవించడం అత్యంత శ్రేయస్కరం. 

అరుదైన సన్నివేశంగా, శ్రీదత్తస్వామి సన్నిధిలో నెలకొన్న శ్రీదత్త వేంకటేశ్వర స్వామిని సేవించి భక్తులు ధన్యులు కాగలరు.   

సూచన *: నిత్య నైమిత్తిక కార్యక్రమ వివరాలకూ, ఆర్జితసేవలలోనూ నిత్యసేవలోనూ పాల్గొనేందుకు, దేవస్థాన కార్యాలయాన్ని సంప్రదించగలరు.